Banner

నవలలను , నాటకాలను సినిమాలుగా ఎడాప్ట్ చేయటం కొత్తేమీ కాదు..అసలు వింతే కాదు..కాకపోతే అలగ్జాండర్ నాటకాన్ని మాత్రం సినిమా చేయటం మాత్రం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే భారత దేశ నాటక రంగ చరిత్రలోనే కాక ప్రపంచంలోనే ఇంత వరకు ఎవ్వరు చేయని వంద నిమిషాలపాటు  సాగే ఒకే ఒక పాత్రగల సాంఘీక నాటిక అలెగ్జాండర్‌ . ఆ పాత్రను అద్బుతంగా రక్తికట్టిస్తున్నారు జయప్రకాష్ రెడ్డి. ఆయనే ఇప్పుడు దాన్ని సినిమాగా చేస్తే అందులోనూ చేసారు. ఇది ఒక అద్బుతమే అని చెప్పాలి.
సినిమాల్లో విలన్ గా , కమిడయన్ గా , క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన హావభావాలతో ఎన్నో పాత్రలను రక్తికట్టించిన జయప్రకాష్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రంగస్థలంపైనున్న మమకారంతో నాటకాలను ప్రదర్శిస్తూ  నాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు జెపి. అయినా  ఇంకా ఏదో చేయాలనే తపనతో తన విగ్రహానికి సరిపోయేటట్టు ‘అలగ్జాండర్’ అనే పేరుతో సాంఘిక నాటకాన్ని ఎంచుకుని ప్రదర్శిచటం మొదలెట్టారు.
రచయిత పూసల రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ నాటకం… ఏకధాటిగా వందనిమిషాలు ఒకే పాత్ర తో సాగుతుంది. అలా కంటిన్యూగా వంద నిముషాల పాటు అలుపు లేకుండా నటించడం చాలా కష్టం..అరుదు.  అలాగే బోర్ కొట్టకుండా ఉంచటం ఓ పెద్ద విన్యాసం. అయితే అవన్నీ జయప్రకాష్ రెడ్డి అలవోకగా సాధించేసారు. ఆ నాటకాన్ని సినిమాగా చేయటం, రీసెంట్ గా ప్రివ్యూ వేయటం జరిగింది. ఆ ప్రివ్యూకు అద్బుతమైన స్పందన వచ్చింది. అలెగ్జాండర్ పేరుకు తగ్గట్టు నిండైన విగ్రహంతో జయప్రకాష్ రెడడి తన పాత్రకు  జీవం పోశారు. 
అలగ్జాండర్ అనే పేరు వినగానే ఇదేదో చారిత్రకం అనే భ్రమ కలుగుతుంది. అయితే ఇది సాంఘికం.   ఏకపాత్రాభినయంకి  భిన్నంగా నేపధ్యంలో చాలా పాత్రలను సృష్టించి రంగస్థలంపై కన్పించకపోయినా వారితో సంభాషించేటట్టు చేయడం ఈ నాటకం లేదా సినిమా ప్రత్యేకత.  ఇటువంటి వాటిని తెలుగు నాటక లక్షణాల్లో ‘బాణం ’ అంటారు.   


కథేంటి
ఆర్మీలో మేజర్‌ అలెగ్జాండర్ ..పదవీ విరమణ అనంతరం సాటివారి సమస్యల పరిష్కారం కోసం జీవిస్తూంటాడు. భార్య లిజా మృతిచెందినా ఆమె స్మృతులను నెమరువేసుకుంటూ అమెరికాలో స్థిరపడిన కొడుకు తమవద్దకు రమ్మన్నా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పరాయిగడ్డపై అవమానాలు వద్దనుకుని, సొంతగడ్డపై నిజాయితీగా బతకాలనుకుంటాడు. 
తన విశ్రాంత జీవితం ఇతరులకు సలహాలు ఇవ్వడం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి ఆర్తులకు సలహాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో హెల్ప్‌లైన్‌లో వచ్చే సంభాషణలకు అనుగుణంగా అలగ్జాండర్ హావభావాలు , మధ్యలో సూదుల్లా గుచ్చుకునే వాడియైన మాటలతో  సాగుతుంది.  సమాజంలో పలు అంశాలను స్పృశిస్తూ మీడియాపై, పోలీసులపై, రాజకీయ నాయకులపై చెణుకులు, చురకలు అంటిస్తూ ఈ సినిమా సాగుతుంది. రచయిత పూసల రాసిన పదునైన సంభాషణలని అంతకు  మంచిన  టైమింగ్‌తో జయప్రకాష్‌రెడ్డి పలుకుతున్నప్పుడు  హర్షద్వానాలు చేయకుండా ఉండలేం.

 
విదేశాల్లో బిజీ జీవితం గడుపుతూ తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో వారు పడే అవస్థలు, మద్యపానం వల్ల కలిగే కష్టనష్టాలు, రాజకీయ నాయకులు తెరవెనుక చేసే కుట్రలు కుతంత్రాలు, మహిళా సంఘాల రాజకీయాలు, పోలీసులపై సెటైర్లు, చిత్ర విచిత్ర వార్తాకథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ వాటి రేటింగ్ పెంచుకునేందుకు టివి ఛానెళ్లు చేసే ప్రయత్నాలు, మీడియా వల్ల జరిగే అనర్థాలు, అనుమానాలతో విడిపోతున్న కుటుంబాలు, పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులు, మాతృభాష గొప్పదనం, వీధిబడుల విలువ, మమ్మి, డాడీల సంస్కృతి విడనాడాలని, కళాశాలల్లో ర్యాగింగ్ వంటి పలు సమస్యలకు పరిష్కారం ఈ సినిమాలో చూపించారు. 
సమకాలీన సామాజిక సమస్యలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. సాటివారికి సహాయం చేయాలని,  సమస్యలకు సానుభూతి చూపటం కాకుండా   పరిష్కారం చూపాలనే అద్బుతమైన సందేశంతో  సినిమా ముగుస్తుంది. 
ఎలా ఉందంటే…
ఇందులో ప్రతీ సన్నివేశం…డైలాగులు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఇంత మంచి సినిమా థియోటర్స్ కు రాకపోవటం చాలా భాధాకరం అనిపిస్తుంది. ఆస్కార్ కు పంపే స్దాయి ఉన్న ఈ సినిమా కు ప్రాంతీయ,జాతీయ అవార్డ్ లు మాత్రం రావటం ఖాయం. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఎఎన్నార్, లకు తను ఏ మాత్రం నటనలో తీసిపోనని, తగ్గనని జెపీ గారు నిరూపించిన చిత్రం ఇది. ఈ సినిమా చూస్తూంటే ఇంతకాలం ఆయనలో ప్రతిభను  సినిమావాళ్లు పూర్తి స్దాయిలో ఆవిష్కరించలేదని అర్దమవుతుంది.  ఈ సినిమా చూసిన కమిడయన్ టార్జాన్…తడారిన గొంతుతో..ఈ సినిమాని నేనే రిలీజ్ చేస్తాను అవకాసం ఇస్తే అని అన్నారు. 
ఏదైమైనా డబ్బై ఏళ్ల వయస్సులో కూడా మనిషి అనుకుంటే సమాజానికి ఏ విధంగా అయినా సేవ చేయచ్చు … అని జెపీ గారు చేసిన పాత్ర మనని ప్రేరేపిస్తూనే ఉంటుంది. హ్యాట్సాఫ్ జేపీ గారు..మీలాంటి నటుడు మన తెలుగులో ఉండటం మా అదృష్టం. ఇక ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు ధవళ సత్యం గారు..చాలా బాలెన్సెడ్ గా నాటకాన్ని చక్కగా తెరకెక్కించి ప్రశంసలు పొందారు.

Banner
Similar Posts
Latest Posts from chinnacinema.com